తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లలు వారి ఆస్తులు పొందాలనుకుంటే చట్టాలు ఒప్పుకోవు..--జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ

జాయింట్ కలెక్టర్ కల్పశ్రీకి వినతిపత్రం అందిస్తున్న సీనియర్ సిటిజన్స్

భీమవరం:తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లలు వారి ఆస్తులు పొందాలనుకుంటే చట్టాలు ఒప్పుకోవని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ  హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026 వేడుకలను భీమవరం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్‌ను జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీకి వినతిపత్రాన్ని అందజేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురిచేస్తే వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. వాటి ద్వారా  తల్లిదండ్రులు తమ హక్కులను కాపాడుకోవచ్చని సూచించారు. తల్లిదండ్రులకు తెలియకుండా వారి ఆస్తులను పిల్లలు స్వాధీనం చేసుకున్న సందర్భాల్లో చట్టపరమైన మార్గాల ద్వారా ఆస్తులను తిరిగి పొందేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ కల్ప శ్రీ భరోసా ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసుకుని తమ సమస్యలను తామే పరిష్కరించుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు వృద్ధాశ్రమాలు, వయోవృద్ధుల కేంద్రాలు, వివిధ సామాజిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా వయోవృద్ధుల్లో చైతన్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్స్ కోసం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సౌకర్యాలను అర్హులైన ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా ఫోరం ఒక వేదికగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో నిలిచిపోయిన రైల్వే పాస్‌లను తిరిగి పునరుద్ధరించాలన్న సీనియర్ సిటిజన్స్ విజ్ఞప్తిని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీనియర్ సిటిజన్స్‌ను ఘనంగా సన్మానించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్‌కు ఏదైనా సమస్య ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, వాటి సత్వర పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం జిల్లా, భీమవరం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...