సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కొమ్ముల మురళీకృష్ణ కు రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

 సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మురళీకృష్ణ


పాలకొల్లు: గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత, పర్యావరణం, విద్య, మానవతా సేవల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీ విజయ డయాగ్నస్టిక్స్ మెడికల్ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళి కృష్ణ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర  అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా ల్యాబ్ కార్యాలయం వద్ద   శనివారం సాయంత్రం మురళీకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

వైద్య సేవలతో మొదలైన కొమ్ముల మురళీకృష్ణ ప్రస్థానం సామాజిక సేవల వైపు విస్తరిస్తూ సుమారు 500లకు పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. వైద్యవృత్తిని కేవలం ఉపాధి మార్గంగా కాకుండా  పదిమందికి ఉపయోగపడే వేదికగా మలుచుకున్నారు. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర అవార్డును అందుకోవడం ఆయన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచింది.  మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన మురళి శ్రీ విజయ డయాగ్నస్టిక్ మెడికల్ ల్యాబ్ ను ప్రారంభించి పలువురికి ఉపాధి కల్పించారు.  నాణ్యమైన సేవ, కష్టపడి పనిచేయాలనే తపన, పట్టుదలతో అంచెలంచెలుగా విస్తరించారు. నేడు ఆ సంస్థ ద్వారా దాదాపు 500 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి విస్తరించింది. లాభాపేక్షకంటే సేవాభావానికే ప్రాధాన్యం ఇస్తూ చిన్న ల్యాబ్‌ను మహావృక్షంగా తీర్చిదిద్దారు మురళీకృష్ణ.

ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు అండ నిలుస్తూ

 షుగర్, బీపీ, కిడ్నీ తదితర పరీక్షలను పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అందించారు. వైద్య పరీక్షలు చేయించుకునే స్థోమత లేని వారికి ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడ్డాయి.


 ...లయన్స్ వేదికగా మరింత విస్తరణ...

తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు లయన్స్ క్లబ్‌ను వేదికగా ఎంచుకున్నారు మురళీకృష్ణ. వివిధ ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. ఆయన అందిస్తున్న సేవలకు విశేష కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల బెస్ట్ లయన్స్ ప్రెసిడెంట్ అవార్డును అందుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లీడర్‌షిప్ మెడల్ కూడా ఆయనను వరించింది. 5సార్లు లయన్స్ అంతర్జాతీయ సేవా పురస్కారాలు, స్వచ్ఛభారత్ పురస్కారాలు అందుకున్నారు.

 ... పర్యావరణం, స్వచ్ఛత  కు ప్రాధాన్యత...

సేవ అంటే కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని నిరూపిస్తూ స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపైనా దృష్టి సారించారు మురళీకృష్ణ. పాలకొల్లులోని తన మెడికల్ ల్యాబ్ పరిసరాల్లో ఉన్న అల్లు వెంకటేశ్వరరావు ఎలిమెంటరీ పాఠశాల ప్రహరీ గోడపై జాతీయ నాయకుల చిత్రాలను వేయించి విద్యార్థుల్లో దేశభక్తి, స్వచ్ఛతపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఇచ్చిన పిలుపుతో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటికి రక్షణ ఏర్పాట్లు చేశారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పాలకొల్లు వాకర్స్ క్లబ్ కార్యకలాపాల్లోనూ మురళీకృష్ణ చురుకుగా పాల్గొంటున్నారు.

... విద్యారంగ సేవలు...

సామాజిక సేవతో పాటు విద్యారంగంలోనూ తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు మురళీకృష్ణ. పాలకొల్లులోని ఏఎస్ఎన్ఎల్, దాసరి నారాయణరావు డిగ్రీ కళాశాలల గవర్నింగ్ బాడీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎంఎంకెఎన్ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.

మురళీకృష్ణ సేవలను గుర్తించిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మూడుసార్లు సేవా పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు ఆయన సేవలకు గుర్తింపుగా నిలిచాయి. తాజాగా రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డు దక్కడంతో ఆయన సేవా ప్రస్థానానికి మరింత గుర్తింపు లభించింది.

...మురళీకృష్ణ లయన్స్ గవర్నర్ కావాలని పాలకొల్లు వాసుల ఆకాంక్ష..

బహుముఖ రంగాల్లో సేవలందిస్తున్న మురళీకృష్ణ భవిష్యత్తులో లయన్స్ గవర్నర్‌గా మరిన్ని సేవలు అందించాలని పాలకొల్లు వాసులు ఆకాంక్షిస్తున్నారు. వృత్తి, ఉపాధి కల్పన, వైద్య సేవలు, స్వచ్ఛత, పర్యావరణం, విద్య, మానవతా కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న మురళీకృష్ణ రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం అందుకోవడం పట్ల పాలకొల్లు వాసులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...