వరిచేలను పరిశీలిస్తున్న పాలకొల్లు ఏ డి ఏ పి.మురళీకృష్ణ
పోడూరు:పోడూరు మండలం లోని కవిటం , జగన్నాధపురం, పెనుమదం గ్రామలలో పంట పొలాలను సహాయ వ్యవసాయ సంచాలకులు(ఏ డి ఏ) పి.మురళి కృష్ణ , మండల వ్యవసాయ అధికారి యం. విశ్వాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడిఏ మురళీకృష్ణ రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వలన MTU - 1318 రకం సాగు చేసిన పొలాలలో BLB (బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు) వ్యాప్తి చెందిందన్నారు. ఈ తెగులు వల్ల ఆకుల చివర్ల నుండి అంచుల వెంబడి ఎండిపోతుందన్నారు. ఈ తెగులును నిర్ధారించేందుకు ఉదయం సమయంలో వరి ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక గ్లాస్ నీటిలో వేయాలనీ, అలా వేసినప్పుడు వరి ఆకులనుండి గమ్ము వంటి ద్రవం(బ్యాక్టీరియల్ ఊజీ) స్రవిస్తే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు (BLB) గా నిర్ధారించవచ్చన్నారు. ఈ తెగులు ఉధృతి తగ్గించడానికి ముందుగా పంట పొలంలోని మురుగు నీరు బయటకు తీసివేయాలనీ, నత్రజని ఎరువులు వాడకం తగ్గించాలనీ, పొటాష్ ఎరువును వెయ్యాలని ఏ డి ఏ మురళీకృష్ణ రైతులకు సూచించారు. అదే విధంగా ప్లాంటో మైసిన్ +కాపర్ హైడ్రాక్సైడ్ (kocide) తగు మోతాదులో పిచికారి చేయాలన్నారు. స్ట్రెప్టో మైసిన్ సల్ఫేట్ 9%+టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 1%sp 100-150గ్రాములు మందును పిచికారి చేయాలని సూచించారు. జగన్నాధపురం గ్రామంలో దశిక రామ మోహన్ రావు పొలంలో సాగు చేసిన చిరు సంచుల ప్రదర్శన (మినికిట్) రకాలుMTU- 1442, MTU-1462, MTU-1290, MTU-1293 రకాలను ఏడిఏ మురళీకృష్ణ పరిశీలించుట జరిగింది. గ్రామ రైతులు, AEO చిరంజీవి , VAA లు సతీష్, దుర్గారావు, ప్రసాద్, రమేష్ ఏడిఏ మురళీకృష్ణ వెంట ఉన్నారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి